ఆంధ్రా పల్స్
Date of Publish : 24 August 2026, 10:06 am Posted by : ఆంధ్రా పల్స్

డ్రైవర్‌కు గుండెపోటు

  •   ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన పాఠశాల బస్సు

ఆంధ్రా పల్స్ – గుంటూరు: గుంటూరు నగరంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. పాఠశాల బస్సు నడుపుతున్న సమయంలోనే డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. స్థానికుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.

గుంటూరులోని ఎస్ వి ఎన్ కాలనీ సమీపంలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ఉదయం విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు బయలుదేరింది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా డ్రైవర్‌ తీవ్రమైన గుండెనొప్పికి గురయ్యారు.

నొప్పి తీవ్రతకు బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో, బస్సు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. ​బస్సులో చిన్నారులు భయంతో కేకలు వేయడంతో గమనించిన స్థానికులు క్షణాల వ్యవధిలో స్పందించారు. వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

​అనంతరం గుండెపోటుతో అస్వస్థతకు గురైన బస్సు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం తక్షణమే స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్థానికులు స్పందించకపోతే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.