ఆంధ్రా పల్స్
Date of Publish : 24 August 2026, 11:23 am Posted by : ఆంధ్రా పల్స్

చక్కెర దిగుమతి చేసుకుంటున్నాం

  • రెడ్‌ ర్యాట్‌ వ్యాధి, ఎల్‌ నినో వల్ల కొరత
  • కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడి
  • పెరుగుతున్న రిటైల్‌ ధరలు

ఆంధ్రా పల్స్ – న్యూఢిల్లీ: దేశంలో చక్కెర కొరత ఏర్పడినట్టు కేంద్రం అంగీకరించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ దేశంలో చక్కెర కొరత, పెరుగుతున్న రిటైల్‌ ధరలపై కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రెడ్‌ ర్యాట్‌ వ్యాధి, ఎల్‌ నినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం తగ్గిందని అందుకే ఇండియాకు చక్కెర కొరత ఏర్పడినట్టు తెలిపారు. ప్రతి ఏడాది ఇండియాకు 280 లక్షల టన్నుల చక్కెర అవసరం ఉంటుందని, ప్రస్తుతం దేశంలో 20-25 లక్షల టన్నుల అదనపు చక్కెర నిల్వలు ఉన్నాయన్నారు.

పెరుగుతున్న రిటైల్‌ ధరలు: కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ హామీ ఇచ్చినప్పటికీ దేశంలో చక్కెర రిటైల్‌ ధరలు పెరుగుతున్నాయి. జూలై 20న చక్కెర కిలో రూ.48.18 ఉండగా ఆగస్టు 20 నాటికి రూ.55.70కి పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత తక్కువ కాలంలో అత్యధికంగా ధరలు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.

ఈ ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ ఎంపీ రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా మాట్లాడుతూ చెరుకు రైతులకు కేంద్రం సకాలంలో బిల్లులు చెల్లించలేదని, అందుకే వారు ఆ పంటను తగ్గించినట్టు తెలిపారు. ఏడాది కాలంగా రైతులకు బిల్లులు చెల్లించకపోతే ఇంకా దానినే పండిస్తారా అని ప్రశ్నించారు. దేశం ఒకప్పుడు చక్కెరను ఎగుమతి చేసేదని, చరిత్రలో మొదటిసారి దిగుమతి చేసుకునే స్థాయికి వచ్చిందని విమర్శించారు.