- ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక
- 20.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు పప్పుధాన్యాల సాగులో 23.6 శాతం వృద్ధి
- పంటల బీమా పరిధి 108 శాతం పెరుగుదల
- రైతుల కోసం ఇంతటి ముందస్తు ప్రణాళిక జగన్ పాలనలో ఎక్కడుంది?: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎక్కడా విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు చేపట్టిందని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటే, వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలు చేయడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తగదని అన్నారు. రైతుల గురించి మాట్లాడే ముందు జగన్ తన ఐదేళ్ల పాలనను ఒకసారి గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. 2026 జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో 192.8 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఇదే కాలానికి సాధారణ వర్షపాతం 393.7 మి.మీ. కాగా, సాధారణంతో పోలిస్తే 51 శాతం లోటు నమోదైందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పప్పుధాన్యాల సాగులో 23.6 శాతం వృద్ధి నమోదు కావడం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు నిదర్శనమని మంత్రి అన్నారు. గత ఏడాది ఆగస్టు 25 నాటికి పప్పుధాన్యాల సాగు 2.16 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది అదే తేదీ నాటికి 2.66 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపారు. పంటల వారీగా కంది 1.92 లక్షల హెక్టార్ల నుంచి 2.30 లక్షల హెక్టార్లకు, మినుము / బ్లాక్‌గ్రామ్ 0.17 లక్షల హెక్టార్ల నుంచి 0.30 లక్షల హెక్టార్లకు, పెసలు 0.041 లక్షల హెక్టార్ల నుంచి 0.061 లక్షల హెక్టార్లకు, సోయాబీన్ 0.048 లక్షల హెక్టార్ల నుంచి 0.100 లక్షల హెక్టార్లకు పెరిగినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ప్రధాన పంటల సాగు విస్తీర్ణం వరి – 10.37 లక్షల హెక్టార్లు, కంది – 2.30 లక్షల హెక్టార్లు, వేరుశనగ – 1.37 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న – 1.00 లక్షల హెక్టార్లు, మినుము – 0.30 లక్షల హెక్టార్లు, పెసలు – 0.061 లక్షల హెక్టార్లుగా ఉందని తెలిపారు. పత్తి సాగు కూడా గత ఏడాది 25.08.2025 నాటికి 3.96 లక్షల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది 3.97 లక్షల హెక్టార్లకు చేరిందని, స్వల్ప పెరుగుదల నమోదైందని మంత్రి చెప్పారు. సాధారణ సీజన్ లక్ష్యం 5.15 లక్షల హెక్టార్లు అని తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే అధిక స్థాయిలో సాగు నమోదైందన్నారు.
*ఫిబ్రవరి నుంచే ఎల్‌నినోపై అప్రమత్తం*
ఎల్‌నినో గురించి కేంద్రం అలర్ట్ చేసినప్పటి నుంచే, అంటే ఫిబ్రవరి 2026 నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించిందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించామని చెప్పారు. నీటిని ఎక్కువగా వినియోగించే పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఖరీఫ్ 2026కు సంబంధించి జిల్లాల వారీగా కరువు నివారణ ప్రణాళికలు, సంక్షోభ నిర్వహణ ప్రణాళికలు రూపొందించామని మంత్రి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎల్‌నినో ప్రభావంతో పంటల నష్టాన్ని నివారించేందుకు, రైతులను ఆదుకునేందుకు “రైతన్న మీకోసం – ఎల్‌నినో ప్రభావ నివారణ ప్రణాళిక – ఖరీఫ్ 2026” కార్యక్రమాన్ని 07.08.2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు
చేస్తున్నామని తెలిపారు.
*పేరుకే ఉచిత పంటల బీమా.. కానీ రైతులకు చేసింది అంతా మోసం*
జగన్ హయాంలో ఐదేళ్లలో ఒక్క రబీ సీజన్లో కూడా ఒక్క రైతుకు ఒక్క పైసా పంటల బీమా పరిహారం ఇవ్వలేదు. ఖరీఫ్‌లో కూడా ఐదేళ్లలో కేవలం రెండేళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించి, మూడు సంవత్సరాలు ప్రభుత్వం తన వాటా ప్రీమియం కూడా చెల్లించలేదు. రైతులకు ఉచిత పంటల బీమా అని ప్రచారం చేసుకోవడం తప్ప, ఆచరణలో రైతులకు బీమా భరోసా కల్పించలేదు. ఇదేనా రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి జగన్ ?. రైతులపై పంటల బీమా ప్రీమియం చెల్లించాలంటూ తమ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులపై భారం మోపడం తమ ప్రభుత్వ విధానం కాదని, అత్యల్ప ప్రీమియంతో స్వచ్ఛందంగా పంటల బీమాలో చేరేలా రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జగన్ నీ హయాంలో రైతుల పంటలకు బీమా భరోసా ఏమైంది? అని మంత్రి ప్రశ్నించారు. రైతుల నుంచి ప్రీమియం వసూలు చేయడమే తప్ప, ప్రభుత్వం తన వాటా ప్రీమియాన్ని సక్రమంగా చెల్లించని పరిస్థితి మీ పాలనలో ఎందుకు ఏర్పడిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్ఛంద పంటల బీమా విధానంలో రైతులు బీమా మొత్తంలో కేవలం 2 శాతం మాత్రమే ప్రీమియంగా చెల్లిస్తున్నారని, మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటాల్లో భరిస్తున్నాయని మంత్రి తెలిపారు. రైతులు చెల్లించే ప్రీమియం కూడా అత్యల్పంగా ఉందని చెప్పారు. వరి ఎకరాకు ₹76, సజ్జకు ₹32, మినుముకు ₹38, వేరుశనగకు ₹280, జొన్నకు ₹35, మొక్కజొన్నకు ₹66, కందికి ₹36, ఉల్లికి ₹90, మిరపకు ₹360 చొప్పున రైతుల ప్రీమియం ఉందని వివరించారు. క్లస్టర్, జిల్లా, పంట, బీమా కంపెనీని బట్టి ప్రీమియం రేట్లలో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చన్నారు. ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులకు ముందస్తు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి తెలిపారు. ఫలితంగా రైతులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పంటల బీమాలో చేరారని చెప్పారు. ఖరీఫ్–2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఖరీఫ్–2026లో 35.1 లక్షలకు పెరిగాయని, బీమా విస్తీర్ణం 7.83 లక్షల హెక్టార్ల నుంచి 15.1 లక్షల హెక్టార్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. రుణేతర రైతుల దరఖాస్తులు కూడా గత ఏడాది 2 లక్షల నుంచి ఈ ఏడాది 20.35 లక్షలకు పెరిగాయని చెప్పారు. ఇప్పటివరకు సుమారు ₹13,983 కోట్ల విలువైన పంటలకు బీమా భరోసా కల్పించామని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఐదో స్థానంలో ఉందని తెలిపారు.
*2019–24 మధ్య రైతుల పంటల బీమాపై జగన్ ప్రభుత్వం ఏం చేసింది?*
2019–24 మధ్య ఐదేళ్లలో ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించిందని చెప్పడం పచ్చి అబద్ధం. గణాంకాలు చూస్తే అసలు నిజం బయటపడుతుంది అని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. 2016 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వ PMFBY అమలులో ఉందని, ఖరీఫ్–2020, 2021లో రాష్ట్ర ప్రభుత్వం సొంత పంటల బీమా పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. 2022లో తిరిగి PMFBYలో చేరినప్పటికీ, ఖరీఫ్–2023లో పథకాన్ని అమలు చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని చెల్లించలేదని స్పష్టం చేశారు. జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఐదు ఖరీఫ్ సీజన్లలో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పంటల బీమా అమలు చేశారు. పథకం అమలు చేసిన చోట కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించలేదు. ఇదేనా రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి? అని మంత్రి నిలదీశారు. రబీ పంటల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. 2019–24 మధ్య ఐదు రబీ సీజన్లలో మూడు సంవత్సరాలు ఏ పంటకూ బీమా పథకం అమలు చేయలేదని, మిగిలిన రెండు సంవత్సరాల్లో పథకం అమలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించలేదని తెలిపారు. మీ హయాంలో ఐదేళ్లలో రబీ పంటల బీమా ద్వారా రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం లేదా ప్రయోజనం అందలేదు. అలాంటప్పుడు ప్రభుత్వమే రైతుల పంటల బీమా ప్రీమియం చెల్లించిందని ఎలా చెబుతారు? రైతులను తప్పుదోవ పట్టించడమే కాదా? అని మంత్రి ప్రశ్నించారు.
*జగన్ ప్రభుత్వం వదిలిన ₹2,000 కోట్ల బకాయిలను కూడా మేమే చెల్లిస్తున్నాం*
గత ప్రభుత్వం చెల్లించకుండా మిగిల్చిన సుమారు ₹2,000 కోట్ల బకాయిలతోపాటు, ప్రస్తుతం చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని కూడా దశలవారీగా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సమర్పించి హామీ ఇచ్చామని మంత్రి తెలిపారు. 2026–27లో ₹500 కోట్లు, 2027–28లో ₹1,000 కోట్లు, 2028–29లో ₹1,500 కోట్లు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంతో అంగీకారం కుదిరిందన్నారు. 2026–27 బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే ₹250 కోట్లు కేటాయించామని, ఖరీఫ్–2026 రైతుల నమోదు సజావుగా జరిగేందుకు ఎస్క్రో ఖాతాలో అవసరమైన ప్రీమియం మొత్తాన్ని కూడా విడుదల చేశామని తెలిపారు. జగన్ నీ హయాంలో రైతులకు బీమా భరోసా ఇవ్వకుండా, ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియాన్ని బకాయిలుగా మిగిల్చారు. మీరు వదిలిన సుమారు ₹2,000 కోట్ల బకాయిలను కూడా మేమే పరిష్కరిస్తున్నాం. మీరు రైతులకు ఇచ్చింది బీమా భరోసానా? లేక బకాయిల భారమా?అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నీ హయాంలో రైతును బీమా రక్షణకు దూరం చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో రైతుకు బీమా భరోసా కల్పిస్తున్నాం. రైతుపై భారం వేయడం మా విధానం కాదు… రైతుకు భరోసా ఇవ్వడం మా విధానం. రైతుల పంటకు బీమా రక్షణ, రైతు కుటుంబానికి భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
