- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం డేటా ఇంటిగ్రేషన్
- డెంగీ, మలేరియా నివారణకు హాట్స్పాట్ల గుర్తింపు
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
ఆంధ్రా పల్స్ – అమరావతి: ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చెయిన్ వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలన్నారు. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ సమీక్షలో వివిధ శాఖల పనితీరు, పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు మరింత సమర్ధత పెంచుకోవాలని, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
క్రాప్ అలర్ట్లపై పర్యవేక్షణ: ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని తెలిపారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే సాగు మొదలు పెట్టని చోట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని నిర్దేశించారు. రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్ అలర్ట్ పంపడంతో పాటు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇందుకోసం ఏపీటీఎస్ అనలిటిక్స్ కూడా వినియోగించుకుని, అవేర్తో సమన్వయం చేసుకోవాలని సీఎం అన్నారు. తాగునీటి వరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. అటు మలేరియా, డెంగీ కేసుల నివారణకు హాట్ స్పాట్ లు గుర్తించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గత ఏడాది ఇదే సమయానికి 1,361 డెంగీ కేసులు నమోదు. ఈ ఏడాది ఇప్పటికి 401 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెన్యువబుల్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. సోలార్ రూఫ్ టాప్లు పెద్దఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.

